పీఎం కూసుమ్ పథకం లో సోలార్ పవర్ ప్లాంట్ స్థాపనకు అనువైన భూములు గుర్తించాలి...
వేసవిలో త్రాగునీటి కొరత రాకుండా తగిన చర్యలు చేపట్టాలి...
క్షేత్రస్థాయిలో ప్రజలకు అవసరమైన మొక్కలను నాటాలి..
జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల దరఖాస్తుల పరిశీలన త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. బుధవారం ఐ డి ఓ సి కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందనతో కలిసి జిల్లాలోని ఆర్డీవోలు, తాసిల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీ వోలు మరియు సంబంధిత అధికారులతో సంక్షేమ పథకాల అమలు, పీఎం కూసుమ్ పథకం, వేసవిలో నీటి కొరత రాకుండా తీసుకోవాల్సిన చర్యలు మరియు ప్లాంటేషన్ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల దరఖాస్తుల ఆన్లైన్ లో ఇంకా నమోదు పూర్తి కానటువంటి గ్రామాల దరఖాస్తులను రేపు ఉదయం లోగా పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. చర్ల 23, దుమ్ముగూడెం 23, అశ్వాపురం 3, మణుగూరు లో 7 మరియు బూర్గంపాడు లో 1 దరఖాస్తులు ఆన్లైన్ చేయవలసి ఉందని వాటిని వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం లో కొత్తగా వచ్చిన 3403 దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఉపాధి హామీ పథకంలో 20 రోజుల పని దినాల కంటే ఎక్కువ ఉన్నవారిని గుర్తించాలన్నారు. ఈ దరఖాస్తులను ఈనెల 31 తారీకు లోపు పరిశీలించి నివేదిక అందించాలని ఆదేశించారు. అదేవిధంగా తప్పుగా బ్యాంక్ అకౌంట్ లో నమోదైనటువంటి 29 దరఖాస్తులను వెంటనే సరైన బ్యాంక్ అకౌంట్ నెంబర్లను నమోదు చేయాలని ఆదేశించారు.
కొత్త రేషన్ కార్డులకు గ్రామ సభలు మరియు ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్దేశిత పట్టిక ద్వారా వివరాలను అందించాలని అధికారులను ఆదేశించారు. ఆ వివరాలను ఆన్లైన్ లో నమోదు చేయడం ద్వారా అర్హులకు డిజిటల్ రేషన్ కార్డ్ మంజూరు చేయటం జరుగుతుందని ఆయన తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క దరఖాస్తును క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.
పీఎం కూసుమ్ పథకం అమలులో భాగంగా విద్యుత్ శాఖ అధికారులు ప్రతి మండలంలో సబ్ స్టేషన్ వివరాలను తాసిల్దారులకు తెలియజేయడం ద్వారా వారు ఆ సబ్ స్టేషన్ కు 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలను గుర్తించాలి. పీఎం కూసుమ్ పథకం క్రింద సోలార్ పవర్ ప్లాంట్ స్థాపనకు నాలుగు ఎకరాల భూమి అవసరం ఉంటుందని, మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ ప్లాంట్ స్థాపన చేయడం వలన 90 శాతం సబ్సిడీ వస్తుందని కలెక్టర్ తెలిపారు. 3 కోట్ల పెట్టుబడిలో 90 శాతం రాయితీ వస్తుందని తెలిపారు. సోలార్ ప్లాంట్ నిర్వహణ ద్వారా సంవత్సరానికి 50 లక్షల ఆదాయం మహిళా సమాఖ్య కు వస్తుందని తెలిపారు. ఏపీవోలు ఆసక్తి గల మహిళా సమాఖ్య సంఘాలను గుర్తించాలని తెలిపారు. ప్రతి మండలంలో ఒక సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం పవర్ ప్లాంట్ స్థాపనకు మన జిల్లాకు 150 ఎకరాల లక్ష్యం ఇచ్చిందని తెలిపారు.
వేసవిలో నీటి కొరత లేకుండా తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా పంచాయతీ అధికారులు గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించి నీటి లభ్యత, నీటి సరఫరా లో సమస్యలను గుర్తించి పది రోజుల్లోగా సమగ్ర నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. గుత్తి కోయిల ఆవాసాలను, గిరిజన గూడెం లను ప్రత్యేకంగా గుర్తించడం ద్వారా వారికి త్రాగునీటి కొరత రాకుండా సోలార్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.
హరితహారం లో నాటే మొక్కలు ప్లాంటేషన్ లక్ష్యాలు మరియు సాధించిన ప్రగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా కలెక్టర్ క్షేత్రస్థాయిలో ప్రజలకు ఉపయోగపడేటటువంటి మొక్కల ప్లాంటేషన్ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇప్ప, ముష్టి గింజలు, తంగేడు, మునగ, సుబాబులు, సిస్సు ,టకొమో మరియు మందారం తదితర మొక్కలను నాటడం ద్వారా గిరిజనులకు ఉపయోగకరంగా ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ప్లాంటేషన్ లో ఎదిగిన మొక్కలను వెంటనే అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో మరియు ప్రభుత్వ కార్యాలయాల్లో నాటాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జెడ్పి సీఈవో నాగలక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, పిడి హౌసింగ్ శంకర్, జిఎం ఇండస్ట్రీస్ తిరుపతయ్య, ఎల్ డి ఎం రామిరెడ్డి, విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర చారి,సెర్ప్ పిడి నీలేష్, అడిషనల్ డిఆర్డిఓ రవి , సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి