TG:స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడంటే..?

 



TG, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:




 తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు అడుగులు పడుతున్నాయి. సెప్టెంబరు మొదటి వారంలో ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 




ఈ నెల 29న జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకుని.. ఆ నివేదికను రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేయనున్నారు. దీని ఆధారంగా ఎన్నికల సంఘం సెప్టెంబరు చివరి నాటికి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేలా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. 




స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుదలగా ఉంది. శనివారం జరిగిన కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) సమావేశంలో ఈ అంశంపై విస్తృతంగా చర్చ జరిగింది.




 ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో ఐదుగురు మంత్రులతో ఒక ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు.




ఇక స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పంచాయతీరాజ్ శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 29న రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనున్న నేపథ్యంలో.. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రాథమిక వివరాలను మరోసారి సరిచూసుకునే పనిలో నిమగ్నమయ్యారు. 




ఎక్కడా పొరపాట్లు జరగకుండా పకడ్బందీగా ఈ ప్రక్రియను చేపట్టారు. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ సృజన శనివారం జిల్లాల కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. 




గ్రామ పంచాయతీలు, వార్డులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల పేర్లు, వాటి సంఖ్యను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి, ఆ వివరాలను వెంటనే రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు.

Post a Comment

కొత్తది పాతది