ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్: తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఇండ్లులేని నిరుపేదల సొంతింంటి కలను నిజం చేసేందుకు ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని జనవరి 26న సీఎం రేవంత్ లాంఛనంగా ప్రారంభించారు. తొలి విడతగా.. రాష్ట్రవ్యాప్తంగా 587 మండలాల్లో ఒక్కో గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లో లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ పథకం కింద ఇంటి నిర్మాణానికి నాలుగు విడతల్లో రూ. 5 లక్షల ఆర్థిక సాయం చేయనున్నారు. మహిళ పేరుమీదే ఇండ్లు మంజూరు చేయనుండగా.. తొలి విడతగా రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గానికి రూ.3,500 ఇండ్లు మంజూరు చేయనున్నారు.
కాగా, ఇందిరమ్మ ఇండ్ల పథకంపై తాజాగా రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు. రానున్న నాలుగేళ్లలో తెలంగాణలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించడమే తమ లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. తొలి విడతగా.. నియోజకవర్గానికి 3,500 ఇళ్లతో పాటు రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలకు అదనంగా ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులు ఉంటాయన్నారు. ఆయా నియోజకవర్గాల్లోని పేదలకు సొంతింటి కలను నిజం చేస్తామన్నారు. ఈ మేరకు మొదటి విడతగా రాష్ట్రవ్యా్ప్తంగా 4.50 లక్షల ఇళ్లను యుద్ధప్రాతిపదికన నిర్మించనున్నట్లు వెల్లడించారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గంలో పూబెల్లి గ్రామంలో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి మంత్రి పొంగులేటి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల గృహ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి వారి సొంతింటి కలను నిజం చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇందిరమ్మ ఇళ్లు అని మంత్రి పొంగులేటి గుర్తు చేశారు. గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో పేదల చిరకాల కోరికను విస్మరించిందని మండిపడ్డారు. తమ ప్రభుత్వం మాత్రం గత 15 నెలల పాలనలోనే అన్ని రంగాలకు పెద్దపీట వేస్తూ.. ప్రజా పాలన కొనసాగిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి