ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;
అక్రమవలసదారుల్ని బహిష్కరిస్తానన్న ఎన్నికలహామీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నెరవేరుస్తున్నారు.* బాధ్యతలు చేపట్టిన తొలిరోజు నుంచే అక్రమవలసదారులపై విరుచుకుపడ్డారు. ఇప్పుడు.. ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా వ్యాప్తంగా 500 మందికి పైగా అక్రమ వలసదారులను పోలీసులు అరెస్టు చేశారు. వందల మందిని దేశం నుంచి పంపించేశారు. దీనికోసం భారీఆపరేషన్ చేపట్టారు. ఈ వివరాలను శ్వేతసౌధం మీడియా సెక్రటరీ కరోలిన్ లీవిట్ వెల్లడించారు. ''యూఎస్ అధికారులు ఇప్పటివరకు 538 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేసింది. ట్రెన్ డి అరగువా గ్యాంగ్ కు చెందిన నలుగురు సభ్యులు, మాదకద్రవ్యాల రవాణా, లైంగిక నేరాల వంటి కేసుల్లో నిందితులుగా ఉన్నవారినే అరెస్టు చేశాం. ఇక, *అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ కొనసాగుతోంది.* సైనిక విమానాల్లో వందల మంది అక్రమ వలసదారులను దేశం నుంచి బయటకు పంపించేశాం. ఎన్నికల్లో ట్రంప్ ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నారు'' అని కరోలిన్ వివరించారు. దేశ సరిహద్దులను భద్రపరచడానికి ట్రంప్ పరిపాలన చేస్తున్న పనిని అభినందిస్తూ వైట్ హౌస్ "చిన్న ప్రివ్యూ"ని పంచుకుంది.
అక్రమ వలసల బిల్లుకు ఆమోదం...
మరోవైపు, జనవరి 23న యూఎస్ కాంగ్రెస్ లో అక్రమవలసలకు సంబంధించిన బిల్లుకు ఆమోదం తెలిపింది. దేశంలోకి అక్రమంగా ప్రవేశించడంతో పాటు దొంగతనాలకు, హింసకు పాల్పడే వారిని నిర్బంధించే బిల్లు అమెరికా ప్రతినిధుల సభలో ఆమోదం పొందింది. ఇదిలా ఉండగా..జనవరి 20న ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయగానే.. అమెరికా ప్రజల రక్షణకు సంబంధించిన పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. ''గత నాలుగేళ్లలో అమెరికాలో అక్రమ వలసదారులు పోటెత్తారు. లక్షలాది మంది సరైన పత్రాలు లేకుండానే అమెరికాలో నివసిస్తున్నారు. ఆ తర్వాత చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ దేశ రక్షణకే ముప్పుగా మారుతున్నారు. అందుకే, అక్రమ వలసదారుల కట్టడికి చర్యలు తీసుకుంటున్నాం'' అని ట్రంప్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి